వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత, డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల ప్రభావంతో బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా కొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న పుత్తడి ధరలు మరింత ఎగబాకే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశీయంగా ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.41 లక్షల స్థాయిలో కదలాడుతుండగా, ఈ ఏడాది జూన్ నాటికి అది రూ.2 లక్షల స్థాయిని తాకే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనావేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,500 డాలర్ల పరిధిలో కొనసాగుతుండగా, మార్చి నాటికి 5,000 డాలర్లను తాకవచ్చని హెచ్‌ఎస్‌బీసీ వంటి అంతర్జాతీయ సంస్థలు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వైపు మరింత ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.
2025లో మాత్రమే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సుమారు 900 నుంచి 950 టన్నుల మేర పసిడిని కొనుగోలు చేసినట్టు అంచనాలు చెబుతున్నాయి. దీంతో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 4,850 మెట్రిక్ టన్నులకు చేరింది. 2011 తర్వాత ఒకే ఏడాదిలో ఇంతటి స్థాయిలో డిమాండ్ నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత నెల చివర్లో బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులను నమోదు చేశాయి. 1979 తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీగా పెరిగిన సందర్భం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. 2025లో గోల్డ్ పెట్టుబడిదారులకు సుమారు 64 శాతం రాబడిని ఇచ్చింది. 2023 నుంచి చూస్తే మొత్తం పెరుగుదల 140 శాతాన్ని దాటింది.
అయితే ఏడాది చివర్లో బంగారం ధరలు కొంత సర్దుబాటు దశకు వెళ్లే అవకాశాలను కూడా కొందరు విశ్లేషకులు తోసిపుచ్చడం లేదు. వేగంగా పెరిగిన ధరలు ఒక దశలో లాభాల స్వీకరణ కారణంగా వెనక్కి తగ్గవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారం పట్ల ఉన్న నమ్మకం తగ్గే అవకాశాలు తక్కువేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా ఆభరణాల విక్రయాలు మాత్రం మందగించాయి. పండుగ సీజన్‌లో కొంతవరకు అమ్మకాలు జరిగినప్పటికీ, ప్రస్తుతం నగల దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ధరలను చూసి సామాన్య వినియోగదారులు బంగారం కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

ఇదే సమయంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఫంక్షన్లు, పండుగలు వంటి సందర్భాల్లో తక్కువ ఖర్చుతో ఆకర్షణీయంగా కనిపించే ఆభరణాల కోసం వినియోగదారులు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో రోల్డ్ గోల్డ్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మొత్తానికి బంగారం ధరలు ప్రస్తుతం పెట్టుబడిదారులతో పాటు సామాన్యుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. రాబోయే నెలల్లో పుత్తడి ధరలు ఏ స్థాయికి చేరుతాయన్నది ఇప్పుడు మార్కెట్‌లో ప్రధాన చర్చాంశంగా మారింది.
Author: Qamar SD
