రోజురోజుకు వెండి ధరలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పెరుగుతున్న వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి మరో అధ్యాయాన్ని లిఖించింది. జనవరి 19న ఒక కిలో వెండి ధర తొలిసారిగా రూ.3 లక్షలను అధిగమించి రూ.3.05 లక్షలకు చేరుకుంది. ఒక్క రోజులోనే దాదాపు రూ.10,000 పెరగడం ట్రేడర్లను, రిటైల్ ఇన్వెస్టర్లను ఒకేసారి ఆశ్చర్యపరిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి 2026 కాంట్రాక్టు రూ.3,01,318 వద్ద, మార్చి 2026 కాంట్రాక్టు రూ.3,01,315 వద్ద ఆల్‌టైమ్ హైని తాకాయి. ఇంట్రాడేలోనే 4.5 నుండి 5 శాతం మధ్య లాభాలు నమోదవడం అరుదైన వేగాన్ని సూచిస్తోంది.
లోకల్ మార్కెట్లోనూ ఇదే ఉత్సాహం కనిపించింది. 100 గ్రాముల వెండి ధర రూ.1,000 పెరిగి రూ.30,500కు చేరగా, 10 గ్రాముల ధర రూ.3,050కు ఎగబాకింది. 8 గ్రాముల ధర రూ.2,440గా, ఒక గ్రాము ధర రూ.305గా నమోదైంది. జనవరి మొదటి 19 రోజుల్లోనే వెండి ధరలు 28 శాతానికి పైగా పెరగడం, అదే కాలంలో బంగారాన్ని మించిపోవడం ఈ ర్యాలీ తీవ్రతను స్పష్టం చేస్తోంది.
భౌగోళిక ఉద్రిక్తతలు.. మార్కెట్ అస్థిరతల మేళవింపు..
వెండి ధరల పెరుగుదలకు భౌగోళిక ఉద్రిక్తతలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధరల పెరుగుదల వెనుక కేవలం డిమాండ్,సరఫరా కారకాలు మాత్రమే లేవు; ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల అస్త్రాన్ని ప్రయోగించే సంకేతాలు ఇవ్వడం, ఈసారి ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనను పెంచింది. దీనికి ప్రతిగా యూరోపియన్ దేశాలు ప్రతీకార సుంకాలను పరిశీలిస్తున్నట్లు ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా సూచిస్తోంది.
అదే సమయంలో గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా వ్యూహాత్మక కదలికలు, యూరప్–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణల భయం కలిసి ‘సేఫ్ హెవెన్’ ఆస్తులపై డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా అంతర్జాతీయ స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 94 డాలర్ల వద్ద 4 శాతానికి పైగా లాభపడి కొత్త రికార్డును నమోదు చేసింది. COMEX సిల్వర్ 93–94 డాలర్ల శ్రేణిలో స్థిరంగా ట్రేడ్ కావడం, గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ బలపడుతోందని సంకేతం ఇస్తోంది.
డిమాండ్ అధికం.. సరఫరా లోటు..
వెండి కి పారిశ్రామికంగా అధిక డిమాండ్ ఉంది, అదేవిధంగావెండి ర్యాలీని కేవలం భయంతో నడిచే పెట్టుబడిగా చూడటం సరికాదని నిపుణులు చెబుతున్నారు. సౌరశక్తి ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్స్, 5G పరికరాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోవైపు మైనింగ్ ఉత్పత్తి పరిమితంగా ఉండటం సరఫరా లోటును తీవ్రతరం చేస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి వెండికి నిర్మాణాత్మక (structural) బలాన్ని ఇస్తున్నాయి. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ ప్రకారం, MCXలో వెండి రూ.2,95,000 పైన నిలకడగా ఉంటే ర్యాలీ కొనసాగుతుంది. రూ.3,05,000ను స్పష్టంగా బ్రేక్ చేస్తే రూ.3,15,000 లేదా అంతకంటే పై స్థాయిలు కనిపించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే రూ.2,90,000 దిగువకు జారితే రూ.2,85,000 వరకు స్వల్ప సవరణ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా వెండి 100 డాలర్ల మార్కును దాటడం 2026లో అసాధ్యం కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, వెండి ఇప్పుడు కేవలం విలువైన లోహం కాదు.. భౌగోళిక రాజకీయ భయం, ద్రవ్యోల్బణ హెడ్జ్, పారిశ్రామిక అవసరం అనే మూడు చక్రాలపై పరుగులు తీస్తున్న పెట్టుబడి సాధనం. చిన్నకాలంలో అస్థిరత తప్పకపోయినా, మధ్య,దీర్ఘకాలంలో వెండి బలమైన కథను చెప్పే అవకాశం ఉంది.

అనధి కాలంలోనే వెండి ధరల ఒడిదుడుకులు కొనసాగొచ్చు, కానీ పారిశ్రామిక డిమాండ్ వెండికి గట్టి పునాది ఇస్తోంది. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే వెండి మరింత ‘సేఫ్ హెవెన్’గా మారే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు దశలవారీగా, రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ప్రవేశించడం ఉత్తమమని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 19, 2025 | 06:23 PM
