వాస్తవ నేస్తం,నిర్మల్ : జిల్లాలోని భైంసా పట్టణంలోని సత్ పూల్ బిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుంచి వచ్చిన కంటైనర్ కారు ను బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన భోజరం పటేల్, రాజన్న, బాబన్న కాగా, డ్రైవర్ వికాస్ కూడా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూతనంగా ఎన్నికైన కుప్టి గ్రామ సర్పంచ్ గంగాధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో భైంసా నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్తతో కుప్టి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bhainsa Road Accident | కంటైనర్ ఢీతో నలుగురు దుర్మరణం.. భైంసా లో ఘోర ప్రమాదం
RELATED ARTICLES
