HomePolitical Newsసంకల్పంతో శిఖరాలను చేరుకున్న మహానాయకుడు రమేష్‌ రాథోడ్   

సంకల్పంతో శిఖరాలను చేరుకున్న మహానాయకుడు రమేష్‌ రాథోడ్   

‌ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో నిత్యజ్యోతిలా వెలుగొంది, జిల్లా ప్రజల హృదయాల్ని మేలుకొలిపి, వారి ఆత్మగౌరవ పతాకాన్ని, నింగిని తాకేలా అహర్నిశలు శ్రమించిన, బడుగు బలహీన వర్గాల దారి దీపం, ఆపద్బాంధవుడు, పేద ప్రజల పెన్నిధి, అందరివాడు, మంచికి మారుపేరు,ప్రజా నాయకుడు రమేష్ రాథోడ్.

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో 1966 అక్టోబరు 20 న గిరిజన రైతు కుటుంబంలో మోహన్ రాథోడ్ కమలాబాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు. రమేష్ రాథోడ్ కు1983, మే 22 న సుమన్ రాథోడ్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అల్లుడు రాంగోపాల్ నాయక్ ఐపిఎస్ అధికారి కాగా,చిన్న కుమారుడు రాహుల్ రాథోడ్ కలెక్టర్ గా ఉన్నారు. పెద్ద కుమారుడు రితేష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తల్లి కుటుంబ బాధ్యతలు స్వీకరించి పిల్లల పోషణ, భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రాథమిక విద్యను తన స్వంత గ్రామంలోనే చదివించింది.

అనంతరం ఉన్నత విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉట్నూరులో చదువుతున్న రోజుల్లో విద్యార్థి నాయకుడిగా అనేక కార్యకలాపాలు నిర్వహించాడు.రమేష్ రాథోడ్ కుటుంబీకులంతా రాజకీయాలతో సంబంధం ఉన్నవారే రాథోడ్ 18 ఏళ్ళ వయసులోకుటుంబ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకొని వ్యవసాయ‌ చేయడం ప్రారంభించారు.రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాల్లో దృష్టి సారించారు. చిన్నతనం నుండే పొరాట పందా అనుసరించడానికి కుటుంబ నేపథ్యమే కారణం. రమేష్ రాథోడ్ నార్నూర్ మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటం కొనసాగిస్తూ,రైతు సంఘం నాయకుడు ఎదిగాడు. నార్నూర్ మండలంలోని రైతులకు భూగర్భ జలాలు పెంపోందించేందుకు, రైతులకు సబ్సిడీ ద్వారా ఊటకుంటలు,వాటర్ షెడ్, చెక్ డ్యామ్ పనులకు సంబంధించి నిధులు మంజూరు అయ్యేలా ఆయన విశేష కృషి చేశారు.

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1995లో తొలి సారిగా తెలుగు దేశం పార్టీ నుండి నార్నూర్ జడ్పీటీసీ గా ఎన్నికై ప్రజా సేవకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ గురువు సముద్రాల వేణుగోపాల్ చారి అండదండలతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాథోడ్ కు ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. 1999 జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టిన రాథోడ్ 2004 వరకు ఎమ్మెల్యే గా సేవలందించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారిస్తూ, రాత్రి పగలు ఇరువై నాలుగు గంటల పాటు ప్రజల మనిషిగా నియోజకవర్గంలోని ప్రజలకు తానున్నానని భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నేతగా వ్వవహారించారు.

2006 నుండి 2009 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా సేవలందించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుండి తన సతీమణి సుమన్ రాథోడ్ ను ఎమ్మెల్యే గా గెలిపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందడంతో 2009లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. లోక్ సభ బరిలోకి దిగిన రాథోడ్ తన దైన శైలిలో ప్రచారం ప్రారంభించి భారీ మెజారిటీతో గెలుపొంది, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై 2014 వరకు పని చేశారు, అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం 17 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసింది.2005 నుండి 2016 వరకు రమేష్ రాథోడ్ పోలిట్బ్యూరో సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ జాతీయ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో తన గళాన్ని వినిపించన రాథోడ్ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన తొలి ఓటును వేసి పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ కోసం తొలి ఓటు వేసిన తెలంగాణ ప్రాంత తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

2014 లో ఆంధ్రప్రదేశ్ ను విభజించడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించే బిల్లును లోక్ సభ ఆమోదించడం పట్ల మద్దతు ప్రకటించారు. 2017 లో తెలుగుదేశం పార్టీని విడి భారత రాష్ట్ర సమితిలో చేరాడు. 2018 లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు బీఆర్ ఎస్ టికెట్ నిరాకరించడంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి కుంతీయా సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2019‌లో జరిగిన లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉండి పోరాటం కొనసాగించారు .

2021లో భారతీయ జనతా పార్టీలో చేరి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా భక్తుడైన రాథోడ్ 2010 లో ఉట్నూర్ పట్టణంలో శ్రీ పూలాజీ బాబా విద్యా సంస్థలను స్థాపించి గిరిజన, గిరిజనేతరుల, నిరుపేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకే కాక ఎందరో పేద విద్యార్థుల చదువులకు ఆయన చేసిన సహాయం మరువలేనిది. చదువు గొప్పతనాన్ని తెల్సుకున్న రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా గోండు తెగకు చెందిన తొలి ఐఏఎస్ అధికారి మడావి తుకారామ్ గారి కాంస్య విగ్రహాన్ని 15 ఫిబ్రవరి 2003లో ఉట్నూర్ ఎక్స్ రోడ్ చౌరస్తాలో నెలకొల్పారు. తన నియోజకవర్గంలో రక్తం యొక్క అవసరాన్ని గుర్తించి, అనేక ఉచిత రక్తశిబిరాలను నిర్వహించారు.ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, గర్భిణీ స్త్రీలకు, క్యాన్సర్, థాలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి సకాలంలో రక్తం అందించి ప్రాణాలను కాపాడవచ్చునని ఖానాపూర్ , ఉట్నూర్ , జన్నారం,ఇంద్రవెల్లి మొదలగు మండలాల్లో ఉచిత రక్తదాన శిబిరాలు , మెడికల్ క్యాంపులు నిర్వహించారు. వృద్ధులకు, వికలాంగులకు,‌వితంతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయించి తన ఖానాపూర్ నియోజకవర్గంలో అనేక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయం అంటే త్యాగంతో కూడిన ప్రజా సేవ అని తన జీవితంలో నిరూపించిన అరుదైన గొప్ప నాయకుడు రాథోడ్. నిత్యం ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతికి కోసం తన చివరి శ్వాస వరకు పని చేసిన సీనియర్ నాయకుడు రాథోడ్ స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరి, జిల్లాకే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టి, జిల్లాలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నాయకుడు. ఎప్పుడూ నవ్వుతూ పలికే మర్చిపోలేని మహానేత 2024 జూన్ 29 న కన్నుమూశారు. రమేష్ రాథోడ్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు ఇంకా ప్రజల హృదయాల్లో నిలిచే ఉన్నాయి.ఆ మహా నీయుని ద్వితీయ వర్థంతి సందర్భంగా వారికి ఘన నివాళి…

వ్యాసకర్త : రాథోడ్ శ్రావణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 

9491467715, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్

ఆదిలాబాద్ జిల్లా,తెలంగాణ

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular