• దశాబ్దాల పోరాటానికి దక్కిన ఫలం.. సామాజిక సాధికారతకు కొత్త దారులు
• జీవో ఎంఎస్ నెం.10 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
• కేంద్ర ‘సీడ్ పథకం ద్వారా అపార ప్రయోజనాలు
• రాష్ట్రవ్యాప్తంగా మేదరి మహేంద్ర సమాజం హర్షం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేదరి మహేంద్ర కులాన్ని డి-నోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ కమ్యూనిటీల జాబితాలో అధికారికంగా చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ‘జీవో ఎంఎస్ నెం.10’ను విడుదల చేసింది. దశాబ్దాలుగా తమ ఉనికి, గుర్తింపు కోసం మేదరి మహేంద్ర సమాజం చేస్తున్న నిరంతర పోరాటానికి ఎట్టకేలకు సత్ఫలితం దక్కింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగిన ఉద్యమం, సంఘం పెద్దల విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ సమాజంలో సర్వత్రా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
విద్య, ఉపాధి రంగాల్లో సరికొత్త అవకాశాలు..
డీఎన్‌టీ గుర్తింపు లభించడంతో మేదరి మహేంద్ర కులస్తులకు విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం డీఎన్‌టీ వర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీడ్ (SEED) పథకం ప్రయోజనాలు ఇకపై వీరికి నేరుగా అందనున్నాయి. యువతకు ఉన్నత నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలు, సులభతరమైన ఆర్థిక సహాయ పథకాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వెనుకబడిన ఈ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేదరి మహేంద్ర సమాజ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. డీఎన్‌టీ గుర్తింపుతో మా వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుతాయి. సంఘం చేసిన నిరంతర ఉద్యమానికే ఈ విజయం దక్కింది.
రాష్ట్ర అధ్యక్షులు జర్రిగల శ్రీనివాస్ కృషికి వందనం : పిల్లి నరేష్, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం సహాయ ప్రచార కార్యదర్శి
మేదరి మహేంద్ర కులానికి ప్రత్యేక గుర్తింపు దక్కడంలో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జర్రిగల శ్రీనివాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని ఆ కులస్తులు కొనియాడుతున్నారు. కుల అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు చేసిన కృషి, ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లిన తీరు వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయన సేవలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు..
బీసీ-ఏ, బీసీ-బీ గ్రూపుల పరిధిలో ఉన్న మొత్తం 52 కులాలలో.. కేవలం రెండు కులాలను మాత్రమే గుర్తించి డీఎన్‌టీ (DNT) జాబితాలో okచేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మేదరి మహేంద్ర సంఘం తరఫున నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల కల నెరవేర్చిన ప్రభుత్వ నిర్ణయం.. భవిష్యత్ తరాల అభ్యున్నతికి, సంక్షేమానికి సుస్థిరమైన బాటలు వేస్తుందని మేదరి మహేంద్ర సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
