📄 ePaper
Friday, May 22, 2026
📄 ePaper
HomeBreaking Newsగోవును జాతీయ జంతువు గా ప్రకటించండి.!

గోవును జాతీయ జంతువు గా ప్రకటించండి.!

• కేంద్ర ప్రభుత్వానికి జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ డిమాండ్
• ఆవు పేరుతో జరిగే మూకదాడులు, విద్వేషాలకు అదే శాశ్వత పరిష్కారం
• నిర్ణయం తీసుకోకుండా కేంద్రాన్ని అడ్డుకుంటున్నది ఎవరు..?
• మతం పేరుతో ప్రాణాలు పోకూడదన్న మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ
• గోరక్షణపై దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని ‘ఎక్స్’ వేదికగా పిలుపు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: దేశంలో గోరక్షణ పేరుతో జరుగుతున్న మూకదాడులు, విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలంటే.. ఆవును తక్షణమే జాతీయ జంతువు గా ప్రకటించాలని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ మేరకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులు, విద్వేష ప్రసంగాల వెనుక ఈ పవిత్ర జంతువు చుట్టూ అల్లుకున్న విభజన రాజకీయాలే మూలకారణమని మదానీ ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో ఏ ఒక్కరి ప్రాణాలు పోకూడదన్న ఆయన.. గోవును జాతీయ జంతువుగా గుర్తిస్తేనే ఈ మత విద్వేష సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న మూకదాడుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కేంద్రాన్ని అడ్డుకుంటున్నది ఎవరు..?

దేశంలోని మెజారిటీ హిందూ వర్గం ఆవును కేవలం పవిత్ర జంతువుగానే కాకుండా, తల్లిగా భావించి పూజిస్తుంది. అలాంటప్పుడు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు.? అని మదానీ సూటిగా ప్రశ్నించారు. గోవు పేరుతో ఆడుతున్న రాజకీయ క్రీడకు ఇకనైనా తెరపడాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రస్తుతం గోమాంసం (బీఫ్) విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు ఉన్నాయని మదానీ గుర్తుచేశారు. మత విద్వేషంతో అమాయకులపై చేసే దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తి అనిపించుకోబోవని, అవి కేవలం రాజకీయ కుతంత్రాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోరక్షణపై ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular