Wednesday, May 27, 2026
HomeCrime NewsFake Job Scam | కోర్టులో కొలువులంటూ కుచ్చుటోపీ.!

Fake Job Scam | కోర్టులో కొలువులంటూ కుచ్చుటోపీ.!

• రూ.17.50 లక్షలు స్వాహా చేసిన నిందితుడు

• జీడిమెట్లకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు

• వివరాలు వెల్లడించిన ఇచ్చోడ ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్

వాస్తవ నేస్తం,ఇచ్చోడ: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ కుటుంబం వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, మోసానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇచ్చోడ ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి చెందిన నక్కల రమణారెడ్డికి, జీడిమెట్లకు చెందిన ఉప్పడి శంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కోర్టులో ఉద్యోగాలు ఉన్నాయని, తాను సులువుగా కొలువులు ఇప్పిస్తానని శంకర్ బాధితుడిని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన రమణారెడ్డి కుటుంబ సభ్యులు.. నిందితుడికి విడతల వారీగా మొత్తం రూ.18,50,000/-చెల్లించారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు, తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిలదీశారు. దీంతో ఉద్యోగాలు ఇప్పించలేనని చేతులెత్తేసిన శంకర్.. తీసుకున్న భారీ మొత్తంలో కేవలం రూ.లక్ష మాత్రమే తిరిగి ఇచ్చాడు. మిగతా రూ.17.50 లక్షలు ఇవ్వకుండా ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు రమణారెడ్డి ఇచ్చోడ పోలీసులను ఆశ్రయించాడు.

మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు శంకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్.హెచ్.ఓ నరేష్ కుమార్ వెల్లడించారు. నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఇదే తరహాలో సదరు నిందితుడి చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే, నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular