📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessGold Investment : బంగారం ధరల మోజు వదిలేయండి… Sensibull సీఈవో అబిద్ హసన్ యువతకు...

Gold Investment : బంగారం ధరల మోజు వదిలేయండి… Sensibull సీఈవో అబిద్ హసన్ యువతకు ఇచ్చిన స్పష్టమైన సందేశం

బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను తాకుతున్న వేళ.. బంగారం, వెండి లలో పెట్టుబడులపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సామాన్య ప్రజల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరూ ఇప్పుడే కొనాలా.? తర్వాత అమ్మాలా.? అనే ఆలోచనలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఆలోచనలకు భిన్నంగా Sensibull వ్యవస్థాపకుడు, సీఈవో అబిద్ హసన్ యువతకు ఒక కీలక సూచన చేశారు. బంగారం, వెండి ధరల పెరుగుదలపై అధికంగా దృష్టి పెట్టడం కన్నా, జీవితాన్ని మలిచే నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఫోమో (Fear of Missing Out)లో పడి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తుకు నష్టం చేయొచ్చని ఆయన అభిప్రాయం.

ఒక బంగారు పతకం… జీవితాన్ని మలిచిన నిర్ణయం

తన మాటలకు, అబిద్ హసన్ తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావించారు. 2000 సంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు 8 గ్రాముల బంగారు పతకం లభించింది. అప్పట్లో ఆ బంగారం విలువ కేవలం రూ.4,000 మాత్రమే. కాలం మారింది. నేడు అదే 8 గ్రాముల బంగారం విలువ దాదాపు రూ.1.2 లక్షలకు చేరుకుంది. సాధారణంగా చూస్తే అది ఒక మంచి పెట్టుబడిగా అనిపించవచ్చు. కానీ అబిద్ హసన్ అప్పుడే ఆ పతకాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆయన జీవితాన్ని మరో దిశగా నడిపించింది. NIT కాలికట్‌లో బీటెక్ పూర్తి చేసి, అనంతరం IIM అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్ డిగ్రీ సాధించారు. ఆ విద్య, ఆ నైపుణ్యాలే Sensibull వంటి విజయవంతమైన స్టార్టప్ స్థాపనకు బలంగా నిలిచాయి.

బంగారం కాదు… నైపుణ్యాలే నిజమైన పెట్టుబడి

తాను తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని అబిద్ హసన్ స్పష్టం చేశారు. “ఆ బంగారు పతకం విలువ కాలక్రమేణా పెరిగింది. కానీ ఆ కోచింగ్, ఆ విద్య నాకు అందించిన అవకాశాలు ఆ విలువకు ఎన్నో రెట్లు ఎక్కువ” అని ఆయన అన్నారు. సంపద అనేది కేవలం ఆస్తుల రూపంలోనే ఉండదని, మన జ్ఞానం, నైపుణ్యాలు కూడా సంపదేనని ఆయన అభిప్రాయం. ముఖ్యంగా టెక్నాలజీ, ఐటీ, స్టార్టప్ రంగాల్లో రాణించాలనుకునే యువతకు ఇది ఒక కీలక సందేశమని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు “ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే అసలు ఆయుధం నైపుణ్యాలే” అని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు బంగారం వంటి సంప్రదాయ ఆస్తుల ప్రాముఖ్యతను కూడా విస్మరించలేమని అంటున్నారు.

Sensibull CEO Abid Hassan advises youth to focus on skills over gold investment
Gold prices may rise, but skills shape careers – Sensibull CEO Abid Hassan

బంగారం భద్రతను ఇస్తే, నైపుణ్యాలు దిశను ఇస్తాయి. ఆస్తులు విలువ పెంచుతాయి.. విద్య, జ్ఞానం అవకాశాలను సృష్టిస్తాయి. ఈ రెండు మధ్య సమతుల్యతే యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక రంగంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 15, 2025 | 05:35 PM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page