📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeAgricultureTomato Farmers | టమాట ధరల పతనంతో రైతన్నల కుదేలు

Tomato Farmers | టమాట ధరల పతనంతో రైతన్నల కుదేలు

• జిల్లాలో తీవ్రంగా ప్రభావితమైన టమాటా రైతులు

• పెరుగుతున్న సాగు ఖర్చులు.. తగ్గుతున్న ఆదాయం

• ఒకప్పుడు లాభాల పంట.. నేడు నష్టాల భారంగా మారిందని రైతుల ఆందోళన

• ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఒకప్పుడు వంటింట్లో తప్పనిసరిగా ఉండే టమాటా పంట నేడు రైతన్నలకు శాపంగా మారింది. రోజువారీ వంటల్లో కీలకమైన పాత్ర పోషించే టమాటకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అదే పంట రైతుల జీవనోపాధికి భారంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, గుడిహత్నూర్ తదితర మండలాల్లో విస్తారంగా సాగు చేసిన టమాట పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చే దశలో ధరలు కుప్పకూలిపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. మార్కెట్‌లో ఒక్క క్యారెట్ టమాటకు కేవలం రూ.50 మాత్రమే ధర పలకడం రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ ధర కోత ఖర్చులు, రవాణా వ్యయాలు కూడా కవర్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో రైతులు అయోమయానికి లోనవుతున్నారు. సాగు ప్రారంభం నుంచి పంట కోత వరకు విత్తనాలు, నర్సరీ మొక్కలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటిపారుదల వ్యయాలు వంటి వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, అమ్మకాల సమయంలో మాత్రం తగిన ఆదాయం దక్కక తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో పాటు, అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతుండటంతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా అప్పులపై సాగు చేసిన చిన్న, సన్నకారు రైతులు మరింత కష్టాల్లో కూరుకుపోయారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, జీవన వ్యయాలు తీరుస్తామనే ఆశతో పంటపై ఆధారపడిన రైతులు, ప్రస్తుతం ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :  Rythu Bharosa Scheme : రైతు భరోసా నిలిపివేత నిజమా.?

పెరుగుతున్న సాగు ఖర్చులు.. తగ్గుతున్న ఆదాయం..

టమాట సాగు అనేది కేవలం విత్తనాలు వేసి పంట కోయడమే కాదు. నర్సరీల నుంచి నాణ్యమైన మొక్కలను కొనుగోలు చేయడం, పొలంలో నాటడం, నీటిపారుదల, ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, పంట సంరక్షణ వంటి అంశాలపై రైతులు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఎండలు, వానలు, చీడపీడల మధ్య పంటను కాపాడుకుంటూ, చివరకు కోతకు సిద్ధం చేసిన తరువాత మార్కెట్‌కు తీసుకెళ్లే దశలోనే రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. కోత ఖర్చులు, రవాణా వ్యయాలు భరించి మార్కెట్‌కు వెళ్లినా సరైన ధర దక్కకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

ఒకప్పుడు లాభాల పంట.. నేడు నష్టాల భారంగా

గతంలో ఈ ప్రాంతంలో టమాట పంట దిగుబడి తక్కువగా ఉన్న సందర్భాల్లో టమాటకు భారీ డిమాండ్ ఉండేదని రైతులు గుర్తు చేస్తున్నారు. వంటల్లో టమాట తప్పనిసరి కావడంతో, మార్కెట్‌లో టమాట కొరత ఏర్పడిన సమయంలో కిలో ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలికేదని తెలిపారు. అప్పట్లో అధిక ధర ఉన్నప్పటికీ వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. అలాంటి రోజులు ఇప్పుడు గడిచిపోయాయని, ప్రస్తుతం టమాట పంట లాభాలకన్నా నష్టాలనే మిగులుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో టమాట పంటకు మంచి దిగుబడి వచ్చింది. పొలాలు ఎర్రగా మెరిసే టమాట పంటతో నిండిపోయినా, అదే అధిక దిగుబడి రైతులకు శాపంగా మారిందని వారు చెబుతున్నారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోవడం, నిల్వ సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో ధరలు భారీగా పడిపోయాయి. పంటను ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచే వీలులేకపోవడంతో, ఎంత తక్కువ ధర వచ్చినా అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులది.

ఇది కూడా చదవండి :  PM-Kisan Installment Released | రైతులారా, కిసాన్ డబ్బు ఖాతాలోకి వచ్చిందా? ఎలా చెక్ చేసుకోవాలి?
Adilabad tomato farmers affected by price crash and rising cultivation expenses
Tomato farmers in Adilabad protest falling prices amid rising cultivation costs

ప్రభుత్వ జోక్యం కోరుతున్న రైతన్నలు..

ఈ పరిస్థితుల్లో సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో టమాట సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని వాపోతున్నారు. పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు చేతికొచ్చే సమయంలో ఆదాయం లేకపోవడం వల్ల ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నామని తెలిపారు. ముఖ్యంగా అప్పులపై సాగు చేసిన రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాల భారం పెరిగిపోతుండటంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొన్నదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి టమాట పంటకు గిట్టుబాటు అయ్యే మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మార్కెట్‌లో ధరల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ జోక్యం అవసరమని, అవసరమైతే నాఫెడ్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టి ధరలను స్థిరపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టమాట వంటి త్వరగా పాడయ్యే పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులు పంటను కొంతకాలం నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ఇలాంటి మౌలిక వసతులు ఉంటే మధ్యవర్తుల చేతిలో దోపిడీకి గురికాకుండా రైతులకు న్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page