• నిర్మల్ జిల్లాలో అరుదైన జపాన్ ‘మియాజాకి’ రకం సాగు
• కడెం మండలం నవాబుపేటలో పండించిన ఆయుర్వేద వైద్యుడు
•కేరళ నుంచి ఒక్కో మొక్క రూ.10 వేలకు కొనుగోలు చేసి పెంపకం
• అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల ధర
వాస్తవ నేస్తం,నిర్మల్: సాధారణంగా మనం మామిడి పండ్లను కిలో వందల్లో కొంటుంటాం. కానీ, ఆ రకం మామిడి కిలో కొనాలంటే అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో ఓ ఆయుర్వేద వైద్యుడు (Ayurvedic Doctor) అరుదైన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ రకం మామిడి పండ్లను (Mangoes) పండించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ మియాజాకి రకం చెట్లు కేవలం శీతల ప్రాంతాల్లోనే పెరుగుతాయని, స్థానిక వాతావరణ పరిస్థితులకు (Weather Conditions) ఇవి తట్టుకోలేవని పలువురు వారించినా.. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపెల్లి సత్యం మాత్రం వెనక్కి తగ్గలేదు. మూడేళ్ల క్రితం కేరళలోని ఒక ఏజెన్సీ ద్వారా ఒక్కో మొక్కకు రూ.10 వేలు ఖర్చు చేసి మొత్తం ఆరు మొక్కలు తెప్పించారు. నవాబుపేటలో తనకున్న ‘సత్యం ట్రెడిషనల్ ఆయుర్వేద ఆశ్రమం’లో వీటిని నాటి సంరక్షించారు. తెచ్చిన ఆరు మొక్కల్లో ఒకటి చనిపోగా, ఐదు ఎదిగాయి. కేవలం రెండున్నరేళ్లకే ఒక చెట్టుకు కాత కాసింది. అసాధ్యం అనుకున్న మామిడి ఈ ప్రాంతంలో కాయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మియాజాకి మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో (International Market) కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ధర పలుకుతుంది. ఈ అరుదైన పంట గురించి వివరించేందుకు శుక్రవారం డాక్టర్ సత్యం.. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను కలిసి, ఆయనకు ఒక పండును బహుమతిగా అందజేశారు.
ఉద్యానవన అధికారి ఏమన్నారంటే..
ఈ మియాజాకి మామిడి సాగుపై ఉద్యానవన శాఖ అధికారి (Horticulture Officer) స్పందనను పలకరించగా.. ఈ ప్రాంతంలో ఇవి సాగవడం చాలా అరుదైన విషయమని అన్నారు. అయితే, కాత కాసినా దీనికి సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడం సవాలుతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారు. ఈ మామిడిలో ఆయుర్వేద గుణాలు మెండుగా ఉండటం వల్లే అంతర్జాతీయంగా ఇంత భారీ ధర ఉంటుందని ఆమెపేర్కొన్నారు.
