• కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై విదేశీ పర్యటనలు చేసినట్లు ఆరోపణలు
• ఈడీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
• ఇప్పటికే దళారీ రిషుశ్రీని అరెస్టు చేసిన స్పెషల్ విజిలెన్స్ యూనిట్
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో సంచలనం రేపిన టెండర్ల కుంభకోణం, మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను శనివారం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో 2017 బ్యాచ్‌కు చెందిన యోగేష్ కుమార్ సాగర్, 2014 బ్యాచ్‌కు చెందిన అభిలాష కుమారి శర్మ ఉన్నారు. యోగేష్ ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తిస్తుండగా, అభిలాష గ్రామీణాభివృద్ధి శాఖలో అదనపు సీఈఓ, ఉప కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రముఖ కాంట్రాక్టర్ రిషు రంజన్ సిన్హా అలియాస్ రిషుశ్రీకి లబ్ధి చేకూర్చే క్రమంలో వీరు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ టెండర్ల కేటాయింపులో సహకరించినందుకు గాను, సదరు కాంట్రాక్టర్ నుంచి వీరు భారీ ఎత్తున లంచాలతో పాటు, విలాసవంతమైన విదేశీ పర్యటనల రూపంలో లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈడీ ఇచ్చిన నివేదిక, సిఫార్సుల మేరకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.
రూ. 21 లక్షల ఖర్చుతో యూరప్ ట్రిప్..!
దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. యోగేష్ కుమార్ సాగర్ తన ఎనిమిది మంది బంధువులతో కలిసి 2024 జూన్ 22 నుంచి 30 వరకు ఐరోపాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆస్ట్రియాలోని వియన్నా, సాల్జ్‌బర్గ్, వోల్ఫ్‌గాంగ్ తదితర నగరాలను సందర్శించారు. వీరికి సంబంధించిన విమాన టిక్కెట్లు, విలాసవంతమైన హోటళ్ల వసతి సహా మొత్తం రూ. 21.92 లక్షల ఖర్చును కాంట్రాక్టర్ రిషుశ్రీ భరించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న కాంట్రాక్టర్ రిషుశ్రీని స్పెషల్ విజిలెన్స్ యూనిట్ (ఎస్‌వియు) మే 28నే అరెస్టు చేసింది. కొన్ని పత్రాలపై సంతకాలు అవసరమనే నెపంతో పాట్నాలోని తమ కార్యాలయానికి పిలిపించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన “రిలయబుల్ ఇన్‌ఫ్రా సర్వీసెస్” కంపెనీకి ప్రభుత్వ టెండర్లు దక్కించుకునేందుకు దళారీగా వ్యవహరించారని, అందుకు ప్రతిఫలంగా ఉన్నతాధికారులకు విదేశీ పర్యటనలు (ఐరోపా, ఆస్ట్రేలియా) స్పాన్సర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
దీంతో రిషుశ్రీపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద ఎస్‌వియు కేసు నమోదు చేయగా, పీఎంఎల్‌ఏ కింద మరో కేసు నమోదైంది. ఆయన నివాసంలో సోదాలు చేయగా సుమారు రూ. 2.5 లక్షల నగదు లభ్యమైంది. కాగా, దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ప్రభుత్వ శాఖల్లోని టెండర్ల ప్రక్రియలో ఇంకెవరెవరు పాలుపంచుకున్నారనే కోణంలో మరికొందరు ఉన్నతాధికారుల పాత్రలపైనా విచారణ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
